అచలపతీ- ఆరంజికోటూ
ఆ రోజు సాయంత్రం క్లబ్బులో జరగబోయే పార్టీ గురించి తలుచుకొంటేనే పొద్దుట్నుంచీ ఆనందంగా ఉంది. నా ఆనందాన్ని మాటల్లో వ్యక్తపరిస్తే ఎలా ఉంటుందాని ఆలోచించి చూస్తే ఇంగ్లీషులో 'ఐయామ్ ఆన్ క్లౌడ్ నైౖన్' అనిపించింది. అద్దానికి తెలుగు మాట ఏమిటాని ఆలోచిస్తే ఏమీ కనబడలేదు. పరభాషా పదాలను, భావాలనూ ఎడాపెడా పుణికి పుచ్చుకునే ప్రక్రియలో మన తెలుగు భాష ఈ మధ్య వెనుకబడిందా అనిపించింది. నాలాటి వాళ్లే పూనుకొని తెలుగు పరిధిని విస్తృతం చేయక తప్పదు. 'అతను ప్రస్తుతం తొమ్మిదో మేఘం మీద ఉన్నాడు, రేపు దశాహం.' అని రాసేస్తే సరి.
ఆనందంగానే అచలపతిని పిలిచేను, ''చూడు, సాయంత్రం క్లబ్బులో పార్టీకీ టైలరు నుండి సూట్ తీసుకొచ్చి రెడీ చెయ్యి'' అన్నాను.
అచలపతి అతివినయంగా ''తప్పకుండా సర్, సూట్ అంటే ఏ కలర్ సూట్ సర్?''
తెలియనట్టు అడుగుతున్నా అతనికంతా తెలుసునని నాకు తెలుసు. ఆ గుడ్డలు కొన్నప్పుడే ఆ నారింజ పండు రంగు కోటుకు, వంగపండు రంగు పాంటుకు పొత్తు కుదరదని అచలపతి సూచించినా, నేను పట్టుపట్టి అవే కొన్నాను. ఆ రంగుల పేర్లు ఉచ్చరించేటప్పుడైనా ఏవగింపు కలిగి ఆ బట్టలు వద్దంటానని అచలపతి దురుద్దేశ్యం కాబోలు.